ఆరంభం :
చోడవరం ను గూర్చి కొంత మనం తెలుసుకోవాలి. క్రితంలో చోళుల రాజ్యం గా, వారికి కేంద్ర బిందువుగా ఉండేదని, చోడవరం పేరు చోళవరం నుండి రూపాంతరం చెంది చివరకు చోడవరం గా మార్పు చెందిందని పెద్దలు చెపుతారు.ఎంతో విశిష్టత కలిగిన మాదైన ఈ గ్రామములో చాల వింతలు విశేషాలు ఉన్నాయి. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెపుతున్నాము. కాని ప్రస్తుత పరిస్తితి అందుకు విరుద్ధముగా ఉన్నమాట వాస్తవము. ఒకింత బాధ కలిగించింది కూడా. అందుకే ఏదైనా చేస్తే బాగుంటుందని అనిపించి సంకల్పం చేయడం, పని ఆరంభించడం కూడా జరిగింది.
ఈ గ్రామంలో ఒక కోట కూడా ఉండేది. నేను ఈ గ్రామం చేరిన నాటికి ఆ కోట యొక్క శిధిలాలు మాత్రమె ఉండేవి. అది నాకు తెలుసు. నేను చూసాను కుడా. ఆ శిధిలాలు ఈనాడు లేవు. ఖాలీ చేసి గృహనిర్మాణానికి అనుగుణం గా మార్చేసారు.
వరసిద్ధి వినాయక స్వామీ ఈ గ్రామ ప్రతేకత. 350 సంవత్సరముల ఘన చరిత్ర కల్గిన స్వయంభూ వినాయక స్వామీ యొక్క తొండము దేవాలయానికి ఒక పర్లాంగు దూరంలో ఉన్న బానయ్య కోనేరు అనే చెరువులోనికి ఉన్నది. ఒకసారి తొండం ను గూర్చి తవ్వకం చేస్తే బానయ్య కోనేరు వరుకు ఉండడం చూసి తిరిగి మూసేశారు. తురుష్కుల కాలంలో స్వామీ దేవాలయం దాడికి గురి కావడం మూలాన తిరిగి దేవాలయాన్ని పునరుద్ధరించారు. కాణిపాకం వినాయకుని తరువాత మా చోడవరం వరసిద్ధి వినాయక స్వామీ దేవాలయం అంత ప్రసిద్ధమైనది.
అదే విధంగా స్వయంభూ గౌరీ పరమేశ్వర ఆలయం మరియొకటి చోడవరం ప్రత్యేకత. ఈ దేవాలయం కూడా 350 సంవత్సరాలకు పైచిలుక చరిత్ర కలిగియున్నది. వరసిద్ధి వినాయక స్వామివారి వలెనె ఈ స్వామికి కూడా తురుష్కుల దండన తప్పలేదు. సదరు దండయాత్రలో స్వామీ యొక్క ఉపరితల లింగ భాగం పూర్తిగా చిద్రమైనది. కాని వరాలివ్వడం లో ఇరు దేవతలు పోటి పడతారనే చెప్పక తప్పదు. తీర్చమన్న సమస్యను, కష్టాన్ని తీర్చడంలో వారికి వారే సాటి. అందుకే రాష్ట్రం పలు మూలాలనుండి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని మరియు స్వయంభూ గౌరిస్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. కావలసివన్ని అడిగి, వరాలు అంది పుచ్చుకుని సంతోషంగా తిరిగి వెళతారు. ఎవ్వరికైనా ఆహ్వానం అన్నట్టుగా ఉంటారు ఇరువురు.
No comments:
Post a Comment